అప్పుడెప్పుడో పదేళ్ళ కిందే ఇండస్ట్రీకి వచ్చింది రకుల్. ఇప్పటికే 30 ఏళ్లు దాటిపోయాయి కూడా. దాంతో పెళ్లి గురించి టాపిక్ మొదలైపోయింది. పైగా అవకాశాలు కూడా ముందు వచ్చినట్లు ఇప్పుడు రావడం లేదు. అందుకే రకుల్‌కు ఎక్కడికి వెళ్లినా కూడా పెళ్లి గురించి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే రకుల్ కూడా చాలా సార్లు తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని కన్ఫర్మ్ చేసింది కూడా. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది రకుల్.

తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమా.. తమిళనాట కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉంది రకుల్. మరోవైపు హిందీలో కూడా ఒకట్రెండు సినిమాలు అయితే ఉన్నాయి. ఇంతలోనే ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ బిజినెస్ మ్యాన్‌తో రకుల్ పెళ్లి జరగబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఇప్పుడు ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది. రకుల్‌కు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని చెప్పింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉందని అన్ని కమిట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అంటుంది.

దాంతో పాటు రకుల్‌కు పెళ్లి ఆలోచన లేదని తాను ఎప్పుడొచ్చి తనకు పెళ్లి చేయండి అని అడుగుతుందో అప్పుడే తాము కూడా ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తాను ఎవరిని కోరుకుంటే అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తామని కూడా చెప్పింది రకుల్ తల్లి. ప్రస్తుతం సినిమా కెరీర్‌తో పాటు బిజినెస్ కూడా చేస్తుంది రకుల్. అక్కడా ఇక్కడా రెండు చేతులా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇవన్నీ పూర్తైన తర్వాత పెళ్లి గురించి ఆలోచనలో పడాలని చూస్తుంది ఈ బ్యూటీ. అప్పటి వరకు సింగిల్.. రెడీ టూ మింగిల్ అంటూ పాడుకోవడమే.