చెన్నై: తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ దక్షిణాది సినీ నటి షకీలా రాజకీయ ప్రవేశం చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పనిచేయనున్నారు. దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయస్సులోనే ‘ప్లేగర్ల్స్‌’ చిత్రంలో నటించారు. గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు.

ఒకప్పుడు మలయాళంలో అగ్ర కథానాయకులకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. దక్షిణాదిలో మరే సినీ తారకు రానంత క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న షకీలా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు..