ఇటీవల తన పదవికి రాజీనామా చేసి, ముందస్తు రిటైర్మెంట్ కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మీద ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారిలో 180 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలో టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా ఉన్న వీకే సింగ్ మీద బదిలీ వేటు వేసింది. ఆయనను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.