ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్పలో యునెస్కో బృందం పర్యటించింది. అనుకున్నట్టుగానే కాకతీయుల శిల్ప కళా నైపుణ్యత యునెస్కో బృందాన్ని కట్టి పడేసింది. ఆలయాన్ని కలియతిరిగిన బృందం అద్భుత కళా నైపుణ్యాన్ని నేత్రపర్వంగా తిలకించారు. సుమారు 5 గంటల పాటు వారి పర్యటన రామప్ప దేవాలయంతో పాటు సరస్సు వద్ద కూడా కొనసాగింది. ఉదయం 10 గంటలకు వీరంతా రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి వీరికి స్వాగతం పలికారు.

రామప్ప ఆలయ శిల్ప కళాసంపదను యునెస్కో బృందంతోపాటు ఆర్కియాలజీ విభాగం ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడాల్లో స్థానం కోసం గతంలో సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న అంశాలు, ఆలయంలో ఉన్న వాస్తవిక శిల్ప కళాసంపదను ప్రతినిధులు పరిశీలిస్తూ వాటిని ఆడియో, వీడియో రూపాల్లో చిత్రీకరించారు. యునెస్కో బృందం ఈ రోజు మరోసారి ఆలయంతోపాటు గుడి పరిసరాల్లో బఫర్‌జోన్ తదితర అంశాలను పరిశీలించనున్నారు.

అటు వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కో బృందం సందర్శించింది. థాయిలాండ్‌కు చెందిన యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన్‌తోపాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కేంద్రం అధికారి జాన్విజ్‌శర్మ, సూపరింటెండెంట్ మిలాన్‌కుమార్‌చౌలే, జిల్లా పురావస్తు శాఖ అధికారి ఎం.మల్లేశంతో కలిసి దేవాలయాన్ని సందర్శించారు. 2019 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప ఆలయం పరిశీలనకు నామినేట్ అయింది. మొత్తానికి ఈసారి కచ్చితంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పకు గుర్తింపు వస్తుందని తెలంగాణవాదులు భావిస్తున్నారు.