సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రతి ఆదివారం-పది గంటలకు -పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగస్వాములవుతూ, ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులను కేటీఆర్‌ కోరారు. రానున్న వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా చూద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

‘ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్నది. కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలందరి సహకారంతో కరోనాపై పోరాడుతున్నాం. గత కొన్ని రోజులుగా కరోనాపై చేస్తున్న సమిష్టి పోరాటం వల్ల ప్రజారోగ్యం, వ్యక్తిగత శుభ్రతపై అందరిలో సానుకూల మార్పు వచ్చింది. భవిష్యత్‌లోనూ ఈ అలవాట్లు, ఆలోచన విధానాన్ని కొనసాగించాలి. గతంలో పట్టణప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని’ మంత్రి వివరించారు.

‘వారానికోసారి 10 నిముషాలైనా మన పరిసరాల శుభ్రత కోసం కేటాయిద్దాం. ఇంటిపరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలు దోమల నివారణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. పురపాలకశాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని’ కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.