ఆస్తి తాకట్టుపెట్టుకొని రుణం ఇస్తామన్నారు 3 లక్షలు తీసుకున్నారు తిప్పి, తిప్పి చివరకు చేతులెత్తేశాడు బ్యాంక్ మేనేజర్, దీంతో వళ్లు మండిన కస్టమర్ మేనేజర్ ను చెత్త కింద కొట్టేశాడు అడ్డంవచ్చినవాళ్లనూ బాదిపారేసాడు ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది.

కెనరా బ్యాంక్‌ శాఖలో వెట్రివేల్ అనే వ్యక్తి తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకని వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు. కానీ బ్యాంక్‌ అధికారులు ఆయన లోన్ దరఖాస్తును తిరస్కరించడం వెట్రివేల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన కత్తి, తుపాకితో బ్యాంక్‌ మేనేజరుపై దాడికి దిగాడు.

బ్యాంకు మేనేజరును రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడి చేసినట్లు అక్కడున్నవారు తెలిపారు. తాను అప్పుల్లో ఉన్నానని, రుణం మంజూరు కాకపోతే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు వెట్రివేల్ తెలిపాడు. ప్రస్తుతం అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు స్పందిస్తూ .. వెట్రివేల్‌ దరఖాస్తు చేసుకున్న మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల రుణం మంజూరు కాలేదని తెలిపారు. అతను మరి కొన్ని ఆస్తులు తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రుణం మంజూరు బాధ్యత తమది కాదని, అది బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నిర్ణయమని బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.