ఓ రెస్టారెంట్ యజమానికి కేవలం రూ.10 కోసం కక్కుర్తి పడ్డాడు. అదే అతడి కొంప ముంచింది. అతడికి రూ.2 లక్షల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ముంబై సెంట్రల్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ కస్టమర్ వద్ద ఐస్ క్రీమ్ ఎమ్మార్పీ కంటే రూ.10 ఎక్కువ తీసుకున్నాడు. అయితే, అది కూడా ఆరు సంవత్సరాల క్రితం. మహారాష్ట్రలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ అయిన భాస్కర్ జాదవ్ 2014 జూన్ 8న తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో షాగున్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తన ఇంటి దగ్గర అతిథులు రావడంతో వారి కోసం ఐస్ క్రీమ్ కొన్నాడు. ఆ ఐస్ క్రీమ్ ప్యాకెట్ మీద రూ.165 ఎమ్మార్పీ ఉంది. కానీ, రెస్టారెంట్ ఓనర్ మాత్రం రూ.175 తీసుకున్నాడు. ఇదేంటని భాస్కర్ జాదవ్ రెస్టారెంట్ ఓనర్‌ని అడిగాడు. అయితే రెస్టారెంట్ ఓనర్ మాత్రం అదంతే అని వాదించాడు. ఐస్ క్రీమ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడానికి ఖర్చవుతుందని, అందుకే ఆ రూ.10 అదనంగా తీసుకున్నానని స్పష్టం చేశాడు. రెస్టారెంట్ ఓనర్ మీద ఎస్ఐ భాస్కర్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. సుమారు ఆరు సంవత్సరాల పాటు వాదనలు జరిగాయి. చివరకు కన్జ్యూమర్ ఫోరం రెస్టారెంట్ ఓనర్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది.

ఓ వస్తువు మీద ఎమ్మార్పీ అని ఉందంటే అంతే తీసుకోవాలని, అలా కాకుండా ఎక్కువ ఎక్కువ ధరలు తీసుకోవడం సమంజసం కాదని ఫోరం స్పష్టం చేసింది. రోజుకు సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 వ్యాపారం చేసే సదరు రెస్టారెంట్ ఇంకా ఎందరు కస్టమర్ల నుంచి ఎన్ని రకాలుగా ఇలా ఎక్కువ ధరలు వసూలు చేస్తుందోనని మండిపడింది. అలాగే, కొన్ని కామెంట్స్ కూడా చేసింది. రెస్టారెంట్‌లో టిఫిన్ కోసం టోకెన్ తీసుకుంటే అందులో వెయిటర్ వాటర్ తెచ్చి పెట్టినందుకు అదనంగా, క్లీనర్ ప్లేట్లు క్లీన్ చేసినందుకు అదనంగా చార్జి వసూలు చేస్తారా అని ప్రశ్నించింది. ప్లేట్ ఇడ్లీ రూ.30 అంటే, అందులో ఇడ్లీ, చట్నీ, సాంబారు, టేబుల్, ఫ్యాన్, మంచినీరు, వెయిటర్ చార్జీలు, క్లీనింగ్ చార్జీలు అన్నీ కలుపుకొని ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే, ఐస్ క్రీమ్ మీద రూ.165 అని ఉంటే అది ఫ్రిజ్‌లో పెట్టడానికి కూడా కలుపుకొని ఉంటుందని, ఫ్రిజ్ లో పెట్టాం కాబట్టి అదనంగా రూ.10 చార్జీ వసూలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది.