వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామ శివారులోని ఓ కుంటలో ఓ యువకుడు, యువతి మృతదేహాలు బయటపడ్డాయి. వీరిద్దరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని అంబాల గ్రామానికి చెందిన గండ్రకోట రాజ్‌కుమార్ (30), అదే గ్రామానికి చెందిన మంత్రి రమ్య (27) పదేళ్ల కిందట ప్రేమించుకోగా, పెళ్లికి వారి పెద్దలు నిరాకరించారు.
ఈ క్రమంలో రమ్యకు జగిత్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. రమ్య భర్త తాగుడుకు బానిసై పది నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందగా ఆమె తన కూతురు, కొడుకుతో పుట్టిల్లు అంబాల వద్దే ఉంటోంది. రమ్య వివాహానంతరం రాజ్‌కుమార్ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన రమను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. లాక్‌డౌన్‌తో రాజ్‌కుమార్ స్వగ్రామం అంబాలకు వచ్చి కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్ రమ్యతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. పదిహేను రోజుల కిందట రాజ్‌కుమార్‌కు ఆయన భార్యతో గొడవ జరగి ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ బుధవారం రమ్యతో ఆటోలో నడికూడ మండలం ధర్మారం గుట్టల వద్దకు వెళ్లారు. ఏమయిందో ఏమో.. కుంటలో వారి శవాలు కనిపించాయి. సీఐ మహేందర్‌రెడ్డి, దామెర, పరకాల ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, వెంకటకృష్ణ, నడికూడ తహసీల్దార్ కోమి, సర్పంచ్ ఉమ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్, రమ్య ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.