వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారంలో ఏర్పాట్లు ఎమ్మెల్యే చల్లాను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు (14న) జిల్లాలోని శాయంపేట మం డలం ప్రగతిసింగారానికి రానున్నారు. పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి ఈ నెల 4న (ఆదివారం) అనారోగ్యంతో మృతి చెందారు. 14వ తేదీ బుధవారం దశదినకర్మ, పెద్దకర్మ, పుణ్యాహావచనం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరై ఎమ్మె ల్యే ధర్మారెడ్డిని పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా పెద్దపెల్లి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకానున్న కేసీఆర్ అక్కడి నుం చి హెలికాప్టర్‌లో ప్రగతిసింగారం గ్రామానికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంటారు. మల్లారెడ్డికి నివాళులు అర్పించి ధర్మారెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిసింగారానికి వస్తారని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. సమీపంలోనే గుట్టలు ఉండడంతో నిపుణులతో మాట్లాడి హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అవసరమైన స్థలాలను గుర్తించారు. జిల్లా కలెక్టర్ ఎం హరిత, సీపీ డాక్టర్ విశ్వనాథ రవీందర్, డీసీపీ కేఆర్ నాగరాజు, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచి అధికారులు, నిఘా వర్గాలు ఆ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. హెలికాప్టర్ దిగిన తరువాత ఎమ్మెల్యే ఇంటికి చేరుకునే మార్గాలను కూడా పరిశీలించారు.
ముందస్తుగా బారికేడ్ల ఏర్పాటు చేశారు. శాయంపేట పరిసర ప్రాంతాలను ములుగురోడ్డు నుంచి ములుగు జిల్లా సరిహద్దుల వరకు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు సోమవారం నుంచే నిఘా పెంచారు. తనిఖీ బృందాలను కూడా రంగంలోకి దించారు. ప్రగతిసింగారంలో ముఖ్యమంత్రి 30 నుంచి 45 నిమిషాలు ఉండే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి.