ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను రేప్ చేసి ఓ వ్యక్తి తప్పించుకున్నాడు. అయితే, ఆ రేప్‌ను ప్రతిఘటిస్తూ, ఆ మహిళ అతడిని కొరికింది. ఆ కొరికిన గాట్లు అతడిని పట్టించాయి. విచిత్రమైన ఈ కేసు వెలుగుచూసింది. థానేలోని జూన్ 23న ఒంటరిగా ఇంటికి వెళ్తున్న 50 ఏళ్ల మహిళను 48 ఏళ్ల లఖన్ దేవ్‌కర్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ తర్వాత బాధితురాలు ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారిస్తున్న సమయంలో పోలీసులు పలు బస్తీలు, మురికివాడల్లో తనిఖీలు చేశారు. ఓ సీసీటీవీ వీడియోను పరిశీలించినప్పుడు నిందితుడు లఖన్ దేవ్‌కర్ కనిపించాడు. అతడిని పోలీసులు విచారణకు పిలిచారు. అతడు చేసిన అత్యాచారం గురించి ప్రశ్నించారు.

అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, అమాయకుడినని నటించాడు. కానీ, అతడి చొక్కా విప్పి చూడగానే అసలు విషయం తెలిసిపోయింది. అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు ప్రతిఘటిస్తూ అతడి ఛాతీ మీద కొరికింది. ఆ పంటిగాట్లకు సంబంధించిన మచ్చలు అలాగే ఉన్నాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.