ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు కేసీఆర్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని సీఎం అన్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పదని అభిప్రాయపడ్డారు.

కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని సీఎం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా వైరస్‌కు జులై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నం అవ్వగా, భారత్‌ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచే ఈ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.