శాంతమూర్తి (40), పుట్టమణి (38) దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 12, 7ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఐతే పుట్టమణి ప్యూరిటనిజాన్ని ఎక్కువగా అనుసరించేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. కాలకృత్యాలకు వెళ్లినా, బయటి వ్యక్తులను ముట్టుకున్నా స్నానం చేయాలని భార్తా పిల్లలకు కండిషన్లు పెట్టేది. అలా వారంతా రోజుకు కనీసం 10 సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. అన్ని సార్లు స్నానం చేయడం వల్ల పిల్లలు చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఐనా అస్సలు వినేది కాదు. అంతేకాదు చివరకు కరెన్సీ నోట్లను కూడా పుట్టమణి కడిగేది. నోట్లను సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేది. ఆమె అతిశుభ్రత వలన భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దంపతులిద్దరు పొలం పనులకు వెళ్లారు.

అక్కడ కూడా ఈ శుభ్రత విషయంలో వాగ్వాదం జరిగింది. భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాంతమూర్తి పొలంలో ఉన్న కొడవలితో పుట్టమణిని నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన శాంతమూర్తి ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు ఫ్యాన్‌కు వేలాడుతూ అతడు కనిపించాడు. తీవ్ర భయభ్రాంతులకు లోనైన చిన్నారులు, చుట్టు పక్కల స్థానికులకు ఇంటికి తీసుకొచ్చారు. అతడు చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పుట్టమణి కోసం గాలించగా ఆమె కూడా పొలంలో శవమై కనిపించింది. మొత్తంగా అతి పరిశుభ్రత ఏకంగా ఓ జంట ప్రాణాలను తీసి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. శాంతమూర్తి, పుట్టమణి చనిపోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల పరిస్థితిని చూసి స్థానికులు కూడా కంటతడిపెట్టారు.