20లక్షల నష్టపరిహారానికి హైకోర్టు ఆదేశం..

రోడ్డు మధ్యలో పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి, మనుషులకు ఏదైనా జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పంజాబ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భివానీ పట్టణంలో రోడ్డుపై రెండు ఎద్దులు కొట్లాడుకుంటూ ఓ వృద్ధుడిపై పడటంతో ఆ వృద్ధుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్డుపై పశువులు ఉంటున్నాయని, అవి రెండూ పోట్లాడుకోవడం వల్లే తన భర్త ప్రాణం పోయిందని, అందువల్ల తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందని నోటీసులిచ్చింది.

మున్సిపాల్టీ ఆ నోటీసుని పట్టించుకోకపోవడంతో ఆమె హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, రోడ్డులో ట్రాఫిక్ సులువుగా ఉండేందుకు పశువులను రాకుండా చేయాల్సిన బాధ్యత మున్సిపాల్టీకి, ప్రభుత్వానికి ఉందని, దానిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ వృద్ధుడు చనిపోయాడని అభిప్రాయపడుతూ 20లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.