దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు వలస బాట ప‌ట్టారు. ఒక‌వైపు ఆకలితో పోరాడుతూ, మ‌రోవైపు ఎండ‌వేడిమి‌ని త‌ట్టుకుంటూ, చుర్రుమ‌నే రోడ్ల‌పై వేల మైళ్ల ప్ర‌యాణాలు సాగిస్తున్నారు. చాలామంది వ‌ల‌స కార్మికుల పాదాలకు చెప్పులు లేవు. ఎండ నుండి ర‌క్ష‌ణ‌కు గొడుగు కూడా లేదు. చండీగఢ్‌లోని మలోయాకు చెందిన 10 ఏళ్ల బాలిక‌ కూడా తన తల్లిదండ్రులతో కలిసి న‌డుస్తూ ముందుకు సాగుతోంది.

ఇంటి నుంచి బ‌య‌లుదేరే ట‌ప్ప‌డు ఆమెకు చెప్పులు ఉన్నాయి. దారిలో అవి పాడ‌యిపోవ‌డంతో ఆ చెప్పుల‌ను పారేసి, ఉత్త కాళ్ల‌తో న‌డ‌క ప్రారంభించింది. ఈ కుటుంబం యూపీలోని ఉన్నావో వెళ్లాల్సివుంది. ప‌ట్ట‌ణంలో ఉపాధి కోల్పోవ‌డంతో ఈ కుటుంబం ఇంటికి బ‌య‌లు దేరింది. ఆ కుటుంబంలోని మ‌హిళ త‌న పేరు ధారిదేవి అని తెలిపింది. 17 రోజుల మ‌నుమ‌డిని ఒడిలో పెట్టుకుని ఇలా ఎండ‌లో ప్ర‌యాణం చేస్తున్నామ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈమె గాథ విన్న‌వారంతా కంట‌త‌డి పెడుతున్నారు.