బాధితుణ్ని మహిళా అధికారిణి చెప్పుతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘లంచం అడిగింది ఈ మేడమే, అనుమతి కోసం ఇంకా నువ్వు పదేళ్లు తిరగాలి చెప్పింది. మీరనలేదా మేడమ్, దేవుడి మీద ఒట్టేసి చెప్పండి’’ అని అరుస్తూ దశరథరామి రెడ్డి అక్కడున్న అందరికీ చెప్పాడు. దీనిపై ఆగ్రహించిన అధికారిణి, చెప్పు తీసుకొని కొడతా ! నన్నే లంచం అడిగానని అంటావా ? “హౌ డేర్ యూ’’ అని ఆవేశంతో ఊగిపోతూ చెప్పులతో బాధితుడిపై దాడి చేసింది. పూర్తీ వివరాలలోకి వెళ్తే హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ మహిళా అధికారిణి ఓ ఇంటి యజమానిపై చెప్పుతో దాడికి దిగింది. ధశరథ రామిరెడ్డి అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది

లంచం అడిగిన వాళ్ళను చెప్పుతో కొట్టడమే మనం విన్నాం. ఇప్పుడు లంచం ఇవ్వలేదని ఒక మహిళా అధికారి ఇంటి యజమానిని చెప్పుతో కొట్టింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు చెందిన దశరథరామిరెడ్డి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కాని వారు అనుమతి ఇవ్వకుండా లంచం అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు..

కోర్టుకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మంగళవారం కంటోన్మెంట్‌ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ క్రమంలో దశరథరామిరెడ్డి మరోసారి నిర్మాణ అనుమతులు కోరగా మహిళా అధికారి ఆగ్రహంతో అతడిపై చెప్పులతో దాడికి పాల్పడింది. అతను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారని బాధితుడు వాపోయాడు. దాడి చేసిన అధికారిణిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని అతడు డిమాండ్‌ చేశాడు.