రెవెన్యూ ఉద్యోగులు తీసుకున్న లంచం వెనక్కి ఇప్పించడమే కాకుండా భూసమస్య వెంటనే పరిష్కరించేలా జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ చర్యలు తీసుకున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన తాండ్య్రాల నర్సయ్య అనే వృద్ధుడికి సర్వే నంబరు 424/12లో నాలుగు గుంటల స్థలం ఉండగా ఇతరుల పేరున నమోదైంది.

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. చివరికి గ్రామ రెవెన్యూ అధికారి రూ.8 వేలు, గ్రామ రెవెన్యూ సహాయకుడు రూ. 2 వేలు లంచంగా తీసుకున్నారు. అయినప్పటికి పని జరక్కపోగా ఈ నెల 5న జిల్లా కలెక్టర్‌ శరత్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు.

ఈ నేపథ్యంలో కొడిమ్యాల తహసీల్దార్‌ను విచారణ జరిపి దస్త్రాలు సవరించడమే కాకుండా తీసుకున్న లంచం ఇప్పించాల్సిందిగా ఆదేశించారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజావాణికి వృద్ధుడు రాగా కలెక్టర్‌ సవరించిన భూదస్త్రాలతోపాటు, తీసుకున్న లంచం సొమ్ము సదరు ఉద్యోగుల నుంచి వెనక్కి ఇప్పించారు. అవినీతికి పాల్పడటమే కాకుండా విధుల్లో నిర్లక్ష్యం చూపిన వీఆర్వో రమేశ్‌రెడ్డి, వీఆర్‌ఏ మహేష్‌ను సస్పెండ్‌ చేశారు.