నాలుగు లక్షల లంచం కేసులో చిక్కినట్టే చిక్కి పరారైన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్‌ హసీనాబీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసింది. అప్పటినుంచి ఆమె పరారీలోనే ఉంది. ఏసీబీ అధికారులు యెంత గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. తన సోదరుడి ద్వారా లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న గూడూరు తహసీల్దార్‌ ఆచూకీ నేటికీ లభించలేదు.

ఆమె సహజీవనం చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్న కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య ఇంట్లో ఆమె ఉన్నట్లు తెలిసి కొన్ని రోజుల క్రితం అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన సైతం నెలరోజులు మెడికల్‌ లీవ్‌ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు సాగుతోంది.ఇంతకీ ఆమె ఎక్కడ? ఇన్ని రోజులుగా తప్పించుకుని ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనేది ఆసక్తికర చర్చగా మారింది.

ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 7వ తేదీ తన సోదరుడు మహబూబ్‌ బాషాను పాణ్యం పట్టణానికి పంపి అతని ద్వారా లంచం తీసుకోవాలని తహసీల్దార్‌ ప్రణాళిక రచించారు. బస్టాండ్‌లో వేచి ఉన్న బాషా లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వెంటనే హసీనాబీ ఉంటున్న ఇంట్లో సోదా చేసినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమె ఏకంగా 5 ఇళ్ళు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు అధికారులు గుర్తించి నివ్వెరపోయారు.