తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యువెలరీస్‌ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనుక వైపు గోడకు పెద్ద రంద్రం చేసిన దొంగలు దుకాణంలోకి చొరబడి సుమారు 35కిలోల బంగారు, వజ్రాభరణాలు దోచుకెళ్లారు. అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ముసుగు ధరించి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఆభరణాలు చోరీ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. సమాచారం అందుకున్న తిరుచ్చి పోలీసులు నగల దుకాణాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

నాలుగు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచ్చిలోని ఇదే అతిపెద్ద నగల దుకాణం. ఈ రోజు ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది.. దుకాణంలో కింది అంతస్తులో భద్రపరిచిన సుమారు 35 కిలోల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్టు గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దుకాణం వెనుక భాగంలో గోడకు మనిషి దూరేంత కన్నం ఉండటంతో దాంట్లోంచి లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు ఘటనా స్థలంలో దుండగులు కారం పొడి చల్లారని తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున 2 లేదా 3 గంటల సమయంలో ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.