భారత్‌లో కరోనా వైరస్‌ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చారు.

దీంతో దిల్లీలోని పలుప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. దీనిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితికి కారణమైన దిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కాలంలో ఆంక్షలను అమలు చేయడంతోపాటు ప్రజారోగ్య సంరక్షణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దిల్లీ రవాణాశాఖ అదనపు ముఖ్యకార్యదర్శితోపాటు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలపై వేటు వేసినట్లు వెల్లడించింది. వీరితోపాటు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, సీలంపూర్‌ సబ్‌-డివిజినల్‌ మెజిస్ట్రేట్‌లను షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.