పెళ్లి అయిన పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు స్థానిక కాలేజీలో 12వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తితో చనువుగా ఉండేది. అది కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగారు. ఓ రోజు వీరి వ్యవహారం యువతి తల్లిదండ్రుల కంట పడింది. దీంతో వారు కూతురిపై కోప్పడ్డారు. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదని చెప్పారు. ఆ వ్యక్తితో మాట్లాడొద్దని సూచించారు. కానీ, ఆ యువతి ఊరుకోలేదు. వెంటనే ఆ వివాహితుడికి ఫోన్‌ చేసి తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి యువతి గ్రామానికి వెళ్లాడు. యువతికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆ యువతి వినలేదు.

తనను పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టింది. దీంతో ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపేశారు. ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కూతురిని బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు చేసిన పనితో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కన్నీరు పెట్టారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు