వ‌రంగ‌ల్ జిల్లా కలెక్ట‌ర్, వైద్య‌, పోలీసులు, పంచాయ‌తీ త‌దిత‌ర అధికారుల‌తో స‌మీక్ష చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి శ్రీ‌మ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్. అనంత‌రం మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

బుధ‌వారం నుంచి లాక్ డౌన్ మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తాం. లాక్ డౌన్ నుంచి ఇక ఎవ్వ‌రికీ స‌డ‌లింపులు, మిన‌హాయింపులు ఉండ‌వు. నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తారు. అతిక్ర‌మిస్తే కేసులు త‌ప్ప‌వు. సీఎం కెసిఆర్ ఆజ్ఞ మేర‌కు మంత్రులుగా మేం క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు స్ప‌ష్టంగా ఆదేశాలిచ్చాం. ప్ర‌జ‌లు ఎవ్వ‌రినీ ఇబ్బంది పెట్టాల‌ని కాదు. ప్ర‌జ‌లంతా బాగుండాలి. వాళ్ళ క్షేమం కోస‌మే ఇదంతా, అంద‌రూ బాగుండాలి. అందులో మ‌నం ఉండాల‌నే ఈ నిర్ణ‌యాలు తీసుకున్నాం. క‌రోనా పూర్తి స్థాయిలో క‌ట్ట‌డి అయ్యే వ‌ర‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి.

అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీట స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. కరోనా వైర‌స్ నిర్మూల‌న‌, తాజా ప‌రిస్థితులు, మ‌క్కలు, ధాన్యం కొనుగోలు, వ‌ల‌స కూలీల‌ను ఆదుకోవ‌డం, బియ్యం పంపిణీ వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి శ్రీ‌మ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కలెక్ట‌ర్, వైద్య‌, పోలీసులు, పంచాయ‌తీ త‌దిత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేశారు. అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌రో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

క‌రోనా క‌ట్ట‌డికి అంద‌రికంటే ముందే సీఎం కెసిఆర్ గారు లాక్ డౌన్ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ న‌డుస్తున్న‌ది. సిఎం గారు అనుకున్న‌ట్లుగా జ‌రిగి ఉంటే ఇప్ప‌టికి క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ‌, దేశంగా ఇండ‌యా ఉండేవి. కానీ, దుర‌దృష్ట వ‌శాత్తు మ‌ర్క‌జ్ మీటింగ్ క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌రింత రెట్టించేలా చేసింది. ఇప్పుడు లాక్ డౌన్ ని మ‌రింత‌గా పెంచే ప‌రిస్థితులు తెచ్చింద‌న్నారు. ద‌య చేసి ప్ర‌జ‌లంతా క‌ఠిన‌మైన లాక్ డౌన్ కి సిద్ధ‌ప‌డాలి. నిబంధ‌నలు ఎవ‌రూ అతిక్ర‌మించ‌వ‌ద్దు.ఇంత కాలంగా కొంత మిన‌హాయింపులుఇచ్చాం. ఇక నుండి ప‌కడ్బందీగా అమ‌లు చేయ‌క‌త‌ప్ప‌ద‌ని సీఎం గారి ఆదేశాల మేర‌కు జిల్లాల ఉన్న‌తాధికారుల‌కు స్ప‌ష్టమైన ఆదేశాలిచ్చామని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

సిఎం కేసీఆర్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో కోవిడ్-19 వైరస్ ను అడ్డుకోగలుగుతున్నాం. రైతులకు, సామాన్యులకు, అన్ని వర్గాల ప్రజానికాన్ని కాపాడుకునేందుకు సిఎం కేసీఆర్ కృషి ఆద‌ర్శ‌నీయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారితో కరోనా రాలేదు. డిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారితో కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. మర్కజ్ పర్యటనకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. వారితో సంబంధాలు ఉన్నవారిలో వరంగల్ అర్భన్ జిల్లాలో 35, జనగామ జిల్లాలో 5 గురికి నెగిటివ్ వచ్చింది. ఎంత‌టి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రజలు సహకరించాలి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

అలాగే ప్ర‌జావ‌స‌రాలు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూర‌గాయ‌లు పంపిణీ చేసే బాధ్య‌త‌ని ప్ర‌భుత్వం తీసుకుంద‌న్నారు. ధ‌ర‌ల నియంత్ర‌ణ చేప‌డుతున్నామ‌న్నారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 దాన్యం కొనుగోలు కేంద్రాలు, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జ‌రిగింది. 6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 10లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వివ‌రించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళనకు గురికావద్దు అని మంత్రి ఎర్ర‌బెల్ల పిలుపునిచ్చారు.

  • బుధ‌వారం నుంచి మ‌రింత ప‌క‌డ్బందీగా లాక్ డౌన్
  • నిబంధ‌న‌లు అతిక్ర‌మించే వాళ్ళ‌పై కేసులు
  • సిఎం కెసిఆర్ గారి ఆజ్ఞ మేర‌కు పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు
  • ముంద‌స్తుగా ముందే హెచ్చ‌రిక‌లు-ప్ర‌జ‌లు ఇబ్బందులు పడొద్ద‌నే చ‌ర్య‌లు
  • జ‌నం క్షేమం కోస‌మే.. క‌ఠిన నిర్ణ‌యాలు- ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి
  • ప్ర‌జ‌లకు అందుబాటులోకి నిత్యావ‌స‌ర సరుకులు, కూర‌గాయ‌లు-నియంత్ర‌ణ‌లో ధ‌ర‌లు
  • ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 దాన్యం, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు
  • 6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 10లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళనకు గురికావద్దు