నాలుగో దశ లాక్ డౌన్ లో కేంద్రం మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. వీటిలో కీలకమైనది బస్సు సర్వీసులు. లాక్ డౌన్ -4లో బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటడానికి వీళ్లేదు. కంటైన్మెంట్ జోన్లు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ రెండు నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చు. పొరుగు రాష్ట్రం అంగీకరిస్తే సరిహద్దులు దాటి కూడా బస్సులు నడుపుకోవచ్చు.

రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై కూడా రాష్ట్రాలకు పూర్తి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. ఇకపై తమ రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించాలనే అంశాన్ని రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదు కానీ కొన్ని నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. కేంద్రానికి సమాచారం మాత్రం ఇస్తే సరిపోతుంది. కార్గో సర్వీసులకు పూర్తి మినహాయింపు ఉంటుంది. అన్ని రకాల వస్తు రవాణా వాహనాల్ని అన్ని రాష్ట్రాల్లో అనుమతించాలని కేంద్రం సూచించింది. చివరికి ఖాళీ ట్రక్కుల్ని కూడా అనుమతించబోతున్నారు.

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు:

  • రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుంది.
  • కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు.
  • రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర సర్వీసులు.
  • దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.
  • దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు.
  • మెట్రో రైలు సేవలు అనుమతి లేదు.
  • పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి.
  • ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ( ఆన్ లైన్ భోధన)ఎప్పటిలాగే కొనసాగుతాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు.
  • వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి.
  • ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లకు అనుమతులు.
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు.
  • సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.
  • రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.
  • మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు.. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.
  • కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే.
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి.
  • రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
  • కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
  • కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అయితే, అత్యవసర వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.
  • రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు.