ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌పైనా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైనా నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరపు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సైతం బయటపెట్టారు. తాజాగా దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదని, తనపై కుట్రలు చేసి, తన తండ్రి కేసీఆర్‌ను బయపెట్టాలని చూస్తున్నారని, కానీ, కేసీఆర్ బయపడే వ్యక్తి కాదని గుర్తుచేశారు. కేవలం కేసీఆర్ బిడ్డను కాబట్టే తనను బద్నాం చేస్తున్నారని చెప్పారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న విపక్షాలపై బట్టకాల్చి మీదేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలకు తాము బెదరబోమని, తమది కొట్లాడే ఫ్యామిలీ అని తెలిపారు.