ప్రేమకు, వివాహానికి వయసుతో పనిలేదని మనసులు కలిస్తే మనువాడటంలో తప్పులేదని ఓ వృద్ధ జంట ప్రపంచానికి చాటింది. త్రిసూర్‌ జిల్లాలోని రామవర్మపురంలోని ఓల్డేజ్‌ హోం ఈ జంట వివాహానికి వేదికైంది. ఓల్డేజ్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న కొచానియన్‌ మేనన్‌ (67), లక్ష్మీ అమ్మాళ్‌ (65)ల మధ్య చిగురించిన స్నేహం లేటు వయసులో పరిణయానికి దారితీసింది. కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్‌ సునీల్‌ కుమార్‌ సమక్షంలో శనివారం వీరు ఒకటయ్యారు.

ఎర్ర చీర ధరించి, ఆభరణాలతో లక్ష్మీ అమ్మాళ్‌ పెళ్లి కుమార్తెగా ముస్తాబు అవగా, కొచానియన్‌ మేనన్‌ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. వృద్ధ జంటకు వివాహాన్ని వేడుకగా జరిపించామని, శుక్రవారం మెహందీ ఫంక్షన్‌ కూడా నిర్వహించామని ఓల్డేజ్‌ హూం సూపరింటెండెంట్‌ జయాకుమార్‌ చెప్పారు. వీరికి 30 ఏళ్ల నుంచి పరిచయం ఉండగా గత కొన్నేళ్లుగా టచ్‌లో లేకపోవడం గమనార్హం. 21 ఏళ్ల కింద మరణించిన లక్ష్మీ అమ్మాళ్‌ భర్త వద్ద కొచానియన్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవారు.

భర్త మరణం అనంతరం బంధువుల వద్ద ఉన్న లక్ష్మీ అమ్మాళ్‌ రెండేళ్ల కిందట ఓల్డేజ్‌ హోంలో చేరారు. రెండు నెలల కిందట అదే కేర్‌ హోంలో కొచానియన్‌ ఆశ్రయం పొందారు. ఇక లేటు వయసులో తాము వైవాహిక బంధంతో ఒకటవడం ఆనందంగా ఉందని, వయసు మీద పడటంతో తాము ఎంతకాలం కలిసి ఉంటామనేది తెలియకపోయినా ఒకరి కోసం మరొకరు ఉన్నామనే భావనతో ఉన్నంతవరకూ సంతోషంగా జీవిస్తామని లక్ష్మీ అమ్మాళ్‌ చెప్పారు.