జిల్లా కేంద్రం శివారు మంగల్‌ కాలనీకి సమీపంలో ఉన్న బీసీ గురుకు పాఠశాలలో ఓ గిరిజన మహిళ స్వీపర్‌గా పనిచేస్తోంది. ఇదే పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ (ప్రత్యేక అధికారి)గా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ అధికారి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడుల రోజు క్రితం ఆ మహిళకు మామ వరుసయ్యే వక్తి వచ్చి పెద్దసారు నిన్ను వాళ్ల ఇంటికి రమ్మంటున్నాడు అని చెప్పాడు. దీనికి ఆమె అంగీకరించ లేదు. నేనెందుకు వాళ్ల ఇంటికి వెళ్లాలని తిరస్కరించింది. ఆ తర్వాత రోజు అదే విషయమై మహిళ తన మామను నిలదీసింది. దీంతో కంగారుపడిన అధికారి మీ మామ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగని గిరిజన మహిళ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో నిన్న వారంతా సదరు అధికారిని నడిరోడ్డుపైనే అడ్డగించి నిలదీశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ చెప్పుతో ఆ అధికారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సదరు అధికారిని వారి నుంచి తప్పించి స్టేషన్‌కి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.