వార్త రిపోర్ట్‌ చేస్తున్న మహిళా పాత్రికేయురాలికి ముద్దు పెట్టినందుకు ఓ వ్యక్తి లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. ఆ రిపోర్టర్‌ లైవ్‌లో వార్తను వివరిస్తూ ఉండగా ఓ వ్యక్తి ముద్దు పెట్టడం గమనార్హం. అమెరికాకు చెందిన వేవ్‌ 3 న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్న రిపోర్టర్‌ సారా రివస్ట్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

న్యూస్‌రూంలో ఉన్న యాంకర్‌ మరో చోట ఉన్న రిపోర్టర్‌తో మాట్లాడడం ప్రారంభించింది. వెంటనే ఓ వ్యక్తి రిపోర్టర్‌ సారా రివస్ట్‌ చుట్టు పక్కల అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వార్త గురించి వివరిస్తూ ఉన్న ఆమె అతణ్ని కనిపెడుతూనే ఉంది. ఈలోపు ఉన్నట్టుండి పక్క నుంచి వచ్చి ఆగంతకుడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టి పరారయ్యాడు.

ఈ సమయంలో ఆమె ఒకింత అసహనానికి గురైనా వార్త చెప్తుండడం ఆపలేదు. అనంతరం ఆ వ్యక్తిపై సారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముద్దు పెట్టిన వ్యక్తిని పోలీసులు ఎరిక్‌ గూడ్‌మ్యాన్‌గా గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.