కర్ణాటకలోని కొడగు జిల్లాకేంద్రం మడికేరిలోని ఒక ఏటీఎం సంచలనాలకు కేంద్రబిందువయింది. ఎందుకంటే ఆ అటోమేటెడ్‌ టెల్లర్‌ మిషన్‌ (ఏటీఎం) రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు ఇవ్వటం మొదలు పెట్టింది మరి కొందరు ఈ విషయాన్ని బ్యాంకు వారి దృష్టికి తీసుకెళ్లే వరకు ఈ తంతు కొనసాగింది. ‘‘ఆ ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ ఒక పొరపాటు చేసింది.

రూ.100 నోట్లు ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను ఉంచింది. దానితో ప్రజలు అక్కడకి వచ్చి రూ. 1.7 లక్షల నగదును చక్కగా విత్‌డ్రా చేసుకుని తీసుకెళ్లిపోయారు. బ్యాంకు నుంచి మాకు ఏ ఫిర్యాదు అందలేదు.’’ అని పట్టణ ఎస్పీ సుమన్‌ పెనిక్కర్‌ చెప్పారు. అయితే బ్యాంకు అధికారులు డబ్బు డ్రా చేసినవారిని గుర్తించి వారిని సంప్రదించారు.

కానీ తీసుకున్న మొత్తాన్ని కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగిలినవారు నగదును తిరిగివ్వటానికి నిరాకరించారు. ఆది బ్యాంకు పొరపాటని, తామెందుకు తిరిగివ్వాలని వాదించారు. చేసేదేం లేక ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆ వ్యక్తులకు సర్దిచెప్పటంతో మిగిలిన సొమ్ము కూడా తిరిగి వచ్చింది. దాంతో సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.