యువతులకు మాయ మాటలు చెప్పి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు: తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని ఒక్కనాడు కీళయూరుకు చెందిన రాజ్‌కుమార్‌ కుమారుడు సంతోష్‌ (23) తిరుపూరులోని ఓ బనియన్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం కరువిలక్కాడు గ్రామానికి చెందిన సత్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో తిరుపూరులో కాపురం పెట్టాడు. ఇలా ఉండగా నెలన్నర క్రితం సంతోష్‌ అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన సత్య తిరుపూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో సంతోష్‌ తిరుపూర్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థిన్ని (19) ప్రేమ వివాహం చేసుకుని కీళయూరులో కాపురం పెట్టినట్లు సత్యకు తెలిసింది. తిరుపూర్‌ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. సంతోష్‌ అంతకు ముందే మరో ఇద్దరు యువతులను ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. యువతులకు మాయ‌ మాటలు చెప్పి వారిని బుట్టలోకి వేసుకునేవాడని అనంతరం పెళ్లి చేసుకుని కొన్ని నెలలు కాపురం చేసి అదృశ్యమయ్యేవాడని తెలిసింది. పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి పట్టుకోటై మహిళా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు…