ఓరుగల్లు సిగలో మరో మణిహారం చేరనుంది. వరంగల్‌కు హైదరాబాద్‌ తరహాలో మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ద పడింది. వరంగల్‌లో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రకు చెందిన మహామెట్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లో మునిసిపల్‌, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో పరిశ్రమల శాఖప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో మహా మెట్రో ఎండీ డాక్టర్‌ బ్రజేష్‌ దీక్షిత్‌, డైరెక్టర్‌ మహేశ్‌ కుమార్‌ బృందంతో ఉన్నత స్థాయి సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో వరంగల్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబందించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

దీంతో సంతృప్తి చెందిన మంత్రి కేటీఆర్‌ మహా మెట్రో ఎండీ డాక్టర్‌ బ్రజేష్‌ దీక్షిత్‌ బృందాన్ని డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) రూపొందదించాలని కోరారు. వరంగల్‌ నగరం చుట్టూ నిర్మించే నియో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ. 2700 కోట్లు అవుతోంది. నిజానికి ఇతర నిర్మాణ సంస్థలు కిలో మీటరు రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాయి. మహా మెట్రో మాత్రం కేవలం రూ. 180 కోట్లకే కిలో మీటరు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించిన ఘనత ఉంది. అదే విదంగా వరంగల్‌ నియో మెట్రో రైలు మార్గానికి మాత్రం కేవలం రూ, 72 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు..

గత నెలలో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు నాగ్‌పూర్‌కు వెళ్ళి మెట్రో రైలు వ్యవస్థ పనితీరు, డబుల్‌ డెక్కర్‌ పని విదానాన్ని పరిశీలించారు. ఈ బృందం మహా మెట్రో అధికారుల బృందంతో విస్తృతమైన చర్చలు జరిపింది. ఈ సంస్థ పనితీరును పరిశీలించిన తర్వాత తెలంగాణలో మౌళిక సదుపాయాల కల్పనలో వారి సహాయం కోరింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు మహా మెట్రో పనితీరుకు సంబందించిన నివేదిక ఈ బృందం అందజేసింది. దీంతో వారిని కేసీఆర్‌ హైదరాబాద్‌కు ఆహ్వానించారు.. హైదరాబాద్‌ పర్యటన అనంతరం మహా మెట్రో సంస్థ , వరంగల్‌ మెట్రో రైలుకు సంబందించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్‌ నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది.