వరంగల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొని భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగుచూసింది. సొంతూరు వెళ్లి తిరిగొస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటట వరంగల్ జిల్లా తక్కళ్లపాడ్ వద్ద చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లెకి చెందిన భార్యాభర్తలు టి.శ్రీనివాస్(40), సమత(35) వరంగల్‌లో నివాసముంటున్నారు.

కొద్దిరోజుల కిందట సొంతూరు వెళ్లిన శ్రీనివాస్ దంపతులు బైక్‌పై వరంగల్‌కు తిరుగుపయనమయ్యారు. మార్గం మధ్యలో వరంగల్ రహదారిపై ఒగ్లాపూర్ – తక్కెళ్లపాడ్ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న బైక్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన భార్య సమతను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.