దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం హర్షణీయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఆయన స్వస్థలం వంగర ఉన్న వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం పొన్నం లేఖ రాశారు. ఎస్సారెస్పీ వరద కాల్వ, రాష్ట్రంలోని ఒక మెడికల్‌ కాలేజీ, ఒక యూనివర్సిటీకి కూడా పీవీ పేరు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి పీవీపై చిత్తశుద్ధి ఉంటే ఆయన శత జయంతి సందర్భంగా ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.