వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూశాయంపేటకు చెందిన శీలం సత్యనారాయణ-సరస్వతి దంపతుల కుమారుడు సంతోష్‌కుమార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా పూర్తిచేశాడు. కరీంనగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంటెక్‌ చదివాడు. ప్రస్తుతం నర్సంపేటలోని బిట్స్‌ కళాశాలలో పరిశోధన విభాగం అధిపతిగా పనిచేస్తున్నాడు. నిరుద్యోగ యువత కోసం ఏదైనా చేయాలనే ఆశయంతో చేపల పెంపకంలో నూతన విధానాన్ని ఆవిష్కరించాడు. రీసర్క్యులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టమ్‌(ఆర్‌ఏఎస్‌) అనేది తక్కువ నీటితో తక్కువ స్థలంలో చేపలను ఉత్పత్తి చేసే పద్ధతి. జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో 25 సంవత్సరాల క్రితం నుంచే ఈ విధానం అమ లులో ఉంది. ఈ పద్ధతిలో చేపలను పెంచాలంటే అత్యాధునిక ఖరీదైన పరికరాలు కావాలి. ఖర్చు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా పెట్టుబడి ఎక్కువ కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు.

ఆర్‌ఏఎస్‌ ప్రత్యేకత:

ఆర్‌ఏఎస్‌ విధానంలో ఇబ్బందులను తొలగించి మత్స్యశాఖకు ఉపయోగపడే ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించాలనే ఉద్దేశంతో బిట్స్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ ఒక ప్రయోగం చేశాడు. తన విద్యార్థులు రంజిత్‌, అభినయ్‌, శివ, రఫీక్‌తో కలిసి రెండు సంవత్సరాలు కష్టపడి కేవలం రూ.3.50 లక్షలతో ఎకనామికల్‌ ఆర్‌ఏఎస్‌ పద్ధతిని రూపొందించారు. లక్ష లీటర్ల నీరు పట్టే విధంగా వంద గజాల స్థలంలో 40 ఫీట్ల లోతు గుంత తవ్వారు. అందులో 3 ఎంఎం వాటర్‌ ఫ్రూప్‌ కవర్‌ అమర్చారు. దానిని నీటితో నింపి పశ్చిమబెంగాల్‌ నుంచి తెప్పించిన తిలాపియా అనే చేప పిల్లలను పోసి తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందులో 8 వేల చేప పిల్లలు ఉంచడం వల్ల అమోనియా పెరిగి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందుకు గాను తక్కువ విద్యుత్‌తో నిరంతరం నీటిని శుద్ధి చేసేందుకు 4 రకాల వాటర్‌ ఫిల్టర్లను తయారు చేశారు. వీటిని బయట కొనాలంటే కనీసం రూ.18 లక్షల ఖర్చు అవుతుంది. కానీ డాక్టర్‌ సంతోష్‌ వీటిని కేవలం రూ.40 వేలతో అధునాతన టెక్నాలజీ వాడి తయారు చేశాడు.