ఎంజీఎం(వరంగల్): ఓ ప్రైవేట్ దవాఖానలో పుట్టిన శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లి ఎంజీఎం దవాఖానలో విక్రయించేందుకు యత్నించిన ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. ఎంజీ ఎం ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన శ్రీలత ఎనిమిది నెలల గర్భిణి. హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. దవాఖానలో పనిచేస్తున్న లత అనే మహిళ శిశువును అపహరించి.. ఎంజీఎం దవాఖానకు తీసుకొచ్చి అత్యవసర చికి త్స కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులకు ఇస్తుండగా సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. లత వారికి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎంజీఎం ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా శిశువును అపహరించినట్టు వెల్లడించింది. సమాచారం అం దుకున్న శిశువు తండ్రి బాలకృష్ణ ఎంజీఎం దవాఖానకు చేరుకుని మహిళ ఎత్తుకొచ్చిన పసిబిడ్డ తమ కూతురని చెప్పాడు. నిందితురాలు తమ ఇంటి పక్కనే నివాసముంటున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నాడు. లత మానసిక స్థితి సరిగ్గా లేదని ఆమె తండ్రి చెప్పినట్టు ఎంజీఎం పీఆర్వో నరేశ్ తెలిపారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. నిందితురాలిని ఠాణాకు తరలించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.