వరంగల్‌ నగరంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన గురువారం వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 25వ డివిజన్‌లోగల వడ్డిరాజు శంకర్రావు ఇటీవల బంధువుల ఇంటిలో శుభకార్యం కోసం లాకర్లో ఉంచిన బంగారాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఇంట్లోనే బీరువాలో బంగారాన్ని ఉంచి రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ పనిమీద వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పనివారు తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్నిచూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగలు పడి సుమారు రూ.15లక్షల విలువైన 50 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న వరంగల్‌ సీపీఎస్‌, మట్టెవాడ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్‌ టీం ఆధారంగా చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. వడ్డిరాజు కాలనీలో గల సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా క్రైం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.