హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు తరహాలో వరంగల్‌లోనూ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ తర్వాత అతి పెద్ద తాగునీటి సరఫరా విధానం గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉంది. రోజూ 173 మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే(ఎంఎల్‌డీలు) సరఫరా చేస్తున్నారు. నగరంలో 1.07 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుత జనాభాకు సరిపడే విధంగా విజన్‌-2030 పేరుతో రూ.553 కోట్లతో అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకాల ద్వారా తాగునీటి సరఫరాను బలోపేతం చేస్తున్నారు. ఏడెమినిది నెలల్లో తాగునీటి పథకం అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయి. ఇంత పెద్ద తాగునీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ ఆదాయం పెరగడం లేదు. నీటి సరఫరాలో చిన్న చిన్న లోపాలు వెంటాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కమిషనర్‌ పమేలా సత్పతి చొరవతో నూతన విధానానికి అడుగులు పడుతున్నాయి. ఏటేటా విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్‌ వాటర్‌ బోర్డు ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. హైదర్‌బాద్‌ మెట్రో వాటర్‌ బోర్డులో పనిచేసిన విశ్రాంత అధికారులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నిపుణులతో వరంగల్‌లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

రెండు రోజుల శిక్షణలో ఆదాయం పెంపు, తాగునీటి సరఫరాలో అత్యాధునిక విధానాలపై తర్ఫీదు ఇస్తారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతి శిక్షణను ప్రారంభిస్తారు. వరంగల్‌ తాగునీటి సలహాదారుడు, విశ్రాంత ఆచార్య పాండురంగారావు ప్రస్తుత వరంగల్‌ నగర నీటి సరఫరా తీరును వివరిస్తారు. రెండో రోజు మంగళవారం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సాంకేతిక నిపుణుడు జంబుల్‌రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ బల్దియా ఇంజినీర్లకు శిక్షణ ఇస్తారు.