వరంగల్‌ మహా నగరంలో 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడనుంది. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సూచనతో జాతీయ పతాకాన్ని అనువైన కూడలిలో ఏర్పాటు చేసేందుకు వరంగల్‌ మహా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ జెండాను చూసిన వెంటనే జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచేలా ఉండాలని, అందుకు అనువైన స్థలాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ.26 లక్షలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. చారిత్రక నగరంగా ఓరుగల్లుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరంగల్‌ మహా నగరం స్మార్ట్‌సిటీగా వర్ధిల్లుతోంది. హృదయ్‌ పథకానికి ఎంపికకావడంతో పర్యాటకుల రాక పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరంగా వరంగల్‌ పేరుగాంచింది. వరంగల్‌ మహా నగరంలోని ఏదైనా ఒక ముఖ్య కూడలిలో 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, పోచమ్మమైదాన్‌లోని రాణిరుద్రమ కూడలి, బల్దియా ప్రధాన కార్యాలయం, భద్రకాళి బండ్‌, హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌ స్థలాలు ప్రాథమికంగా పరిశీలనలో ఉన్నాయి. తొలుత ఒక కూడలిలో ఏర్పాటుచేసి, రెండో విడతలో మరో కూడలిలో కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. వరంగల్‌ ప్రాంతంలోని ఏదైనా జంక్షన్‌లో జాతీయజెండాను ఏర్పాటు చేయాలని మేయర్‌ అధికారులకు సూచించారు. ఈనెల 6న జరగనున్న గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ రైల్వేస్టేషన్ల ఆవరణలో భారీ జాతీయ జెండాలు ఎగురుతున్నాయి. ఇదే పద్ధతిలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ముందు ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.