‌వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ హన్మకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకులు మృతి చెందారు. హన్మకొండ ఎస్‌హెచ్‌వో బోనాల కిషన్‌ వివరాల ప్రకారం.. కాజీపేట దర్గాకు చెందిన సాదుల ప్రసాద్‌, ఆయన తల్లి పుష్పలత ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ములుగు రోడ్డు నుంచి హన్మకొండ వైపునకు వస్తున్నారు. ఐశ్వర్య గార్డెన్‌ సమీపంలోకి వచ్చిన వెంటనే రోడ్డుపై ఉన్న గుంతలో ద్విచక్ర వాహనం పడిపోయింది.

అదే సమయంలో హన్మకొండ నుంచి ఏటూరునాగారం వస్తున్న బస్సు కింద ఇద్దరు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ తల్లీకొడుకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దర్గా కాజీపేటలో వీరు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు.

వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో మృత్యువాత పడ్డారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పరిస్థితిని పరిశీలించి గుంతతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. తల్లి, కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.