వరంగల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం: బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్‌పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న KUC పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా, వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.