ఓ యువకుడు అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు యువకుడిని పోలీసులకు అప్పగించి శిక్షించాల్సింది పోయి, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయి కన్యత్వానికి విలువ కట్టారు. అబ్బాయికి రూ.2 లక్షలు జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. మరీ ఆ డబ్బు అయిన బాధిత కుటుంబానికి దక్కిందా అంటే అదీ లేదు. అబ్బాయి చెల్లించిన నగదులో నయా పైసా బాధిత కుటుంబానికి ఇవ్వకుండా పెద్ద మనుషులే పంచుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి.. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్దమనుషులను ఆశ్రయించారు. దీంతో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి అఘాయిత్యానికి ప్రయత్నించిన అబ్బాయికి రూ.2లక్షల జరిమానా విధించారు.

అయితే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందించకుండా పంచాయితీ తీర్మానం చేసిన పెద్ద మనుషులే తలా కొంచెం పంచుకున్నారు. బాధిత కుటుంబానికి పైసా కూడా చెల్లించకుండా వ్యవహరించిన పెద్దమనుషుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని పోలీసులకు అప్పగించకుండా అమ్మాయి శీలానికి వెల కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.