మహబూబాబాద్‌ జిల్లా బలరాంతండా గ్రామ పరిధిలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు.

కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు:

ఖమ్మం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువతి (24) ఈ నెల 6న హైదరాబాద్‌ నుంచి రైలులో బయలుదేరి 7న ఉదయం మహబూబాబాద్‌కు చేరుకుంది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించింది. ఎటూ తోచక రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనకు పరిచయమున్న బలరాం తండాకు చెందిన ఓ యువకుడికి ఫోన్‌ చేసి డబ్బు అడగ్గా తండాకు రమ్మని చెప్పడంతో అక్కడికి చేరుకుంది.

సదరు యువకుడితో పాటు మరో ఎనిమిది మంది కలసి డబ్బు ఇస్తామని ఆమెను గ్రామ శివారులో మామిడి తోటకు తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మామిడితోట నుంచి అరుపులు వినిపించడంతో అటుగా బైక్‌పై వెళుతున్న బలరాం తండా సర్పంచ్‌ ఇస్లావత్‌ నీలవేణి భర్త హరి ఘటనా స్థలం దగ్గరికి వెళ్లాడు. ఆయన రాకను గమనించిన నిందితులు పరారయ్యారు.

బాధితురాలితో మాట్లాడి ఆమె తండ్రికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇస్లావత్‌ రఘు, ఇస్లావత్‌ కిషన్‌ (బలరాంతండా), గుగులోతు హుస్సేన్‌ (భవానీనగర్‌ తండా)లు తప్ప మిగతా వారంతా మైనర్లని ఎస్పీ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించి త్వరలోనే కోర్టులో చార్జిïషీటు వేస్తామని తెలిపారు…