కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నమోదులో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ నగరమే నిలిచింది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని గుర్తించి ఎంజీఎం ఆసుపత్రి కోవిడ్‌ వార్డులో చేర్చిన విషయం తెలిసిందే. అందులో శుక్రవారం 21, శనివారం 4, ఆదివారం 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మినహా 26 మంది మర్కజ్‌ వెళ్లివచ్చిన వారే కావడం గమన్హారం.

కొవిడ్‌ వార్డులో కరోనా పాజిటివ్‌ రోగికి వైద్యసేవలందించిన నలుగురు పీజీ వైద్యులు, ఒక సీనియర్‌ వైద్యుడికి నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో నెగిటీవ్‌ రిపోర్టులు వచ్చినట్లు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ వెళ్లిన వారిలో పాజిటివ్‌ వచ్చిన 27 మంది కుటుంబాలకు చెందిన 161 మందిని వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రాంతీయ నేత్రవైద్యశాల, కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.

మరో 62 మందిని కాకతీయ యూనివర్సిటీకి తరలించారు. వీరితో క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య 223కి చేరింది. ప్రాంతీయ నేత్రవైద్యశాలలో ఉన్న వారిలో 35 మంది రక్త నమూనాలను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి తెలిపారు.