ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధురాలు చనిపోతే అరిష్టమని భావించి ఓ యజమానురాలు బయటకు గెంటేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్దురాలు రోడ్డుపైనే తనువు చాలించింది. ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం రసూల్‌బీ (67) కొన్నేళ్లుగా పెద్దపెండ్యాలలోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారం క్రితం అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఇంట్లో చనిపోతే అరిష్టంగా భావించిన ఇంటి యజమానురాలు, రసూల్‌బీని మంచంతో సహా బయట పడేసింది.

ఈ విషయం తెలుసుకున్న సహృదయ ఆశ్రమ నిర్వాహకులు యాఖూబీ, ఛోటులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడానికి అంబులెన్స్‌ను సిద్ధం చేస్తున్న క్రమంలో రసూల్‌బీ తుది శ్వాస విడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపారు…