రాజస్థాన్‌ నుంచి వరంగల్‌ నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మిఠాయి దుకాణాన్ని నడుపుకుంటూ ఆనందంగా జీవిస్తుండ గా అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. ఆరు సంవత్సరాల నుంచి భర్త వెన్నుపూస నొప్పితో బాధపడుతుండగా, భార్య బ్రెయిన్‌ క్యాన్సర్‌తో 9 నెలల క్రితం కన్నుమూసింది. దీంతో ఆర్థికంగా చితికిపోయి అష్టకష్టాలు పడుతున్న ఆ కుటుంబం దాతల సాయంతో బతుకుబండిని నెట్టుకొస్తోంది. ఓం ప్రకాశ్‌ కుటుంబం రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి 30 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వరంగల్‌ నగరానికి వచ్చింది. గిర్మాజీపేట ప్రాంతంలో ఓ మిఠాయి దుకాణం పెట్టుకుని ఓంప్రకాశ్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

వీరి కుటుంబం సంతోషంగా సాగుతున్న సమయం లో దంపతులు అనారోగ్యానికి గురయ్యారు. ఆరు సంవత్సరాల నుంచి ఓం ప్రకాశ్‌ వెన్నుపూస నొప్పితో సరిగా నడవలేక, కూర్చోలేక ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే, నాలుగు సంవత్సరాల క్రితం భార్య సావిత్రికొలారియా బ్రెయిన్‌ క్యాన్సర్‌కు గురై ఇంటికే పరిమితమైంది. దీంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మిఠాయి దుకాణాన్ని బంద్‌ చేశారు. భార్యను బతికించుకోవడానికి దాదాపు రూ.10 లక్షలకు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. ఇదే సమయంలో పెద్ద కూతురికి రెండేళ్ల క్రితం దాతల సాయంలో పెళ్లి చేశారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య 9 నెలల క్రితం కన్ను మూసింది. దీంతో ఓంప్రకాశ్‌ చిన్న కూతురు, కుమారుడు కుటుంబానికి అండగా ఉంటూ చదువుకుంటున్నారు. ఇదే క్రమంలో వృద్ధురాలైన తల్లి శాంతాబాయి సైతం పక్షవాతానికి గురై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. ఓం ప్రకాశ్‌ పనిచేయలేక ఇంటికి పరిమితం కావడం, ఇద్దరు పిల్లలను చదివించుకోవడం భారంగా మారింది.

వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. చేతిలో పనిలేదు, చేయడానికి శక్తి లేదు. ఇప్పటికే కొంతమంది దాతలు ముందుకు వచ్చి సాయం అందించారు. వారి మేలు మరువలేను. కుటుంబం గట్టెక్కడానికి, పిల్లల పెద్ద చదువులకు ఆర్థిక పరిస్థితులు అడ్డు వస్తున్నాయి. దాతలు కనికరిస్తే మాకు మంచి రోజులు వస్తాయనే ధీమాతో ఉన్నాం. దాతలు 9849374172 నంబర్‌లో సంప్రదించాలి.