కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ఫిరాయింపుల కలకలం రేగింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఆయనతో పాటు వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మరి కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది, ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస లో చేరుతున్న క్రమంలోనే పొదెం వీరయ్యా ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రె్‌సలోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న పొదెం వీరయ్య పార్టీని వీడుతున్నట్లుగా ప్రచారం జరగడం పార్టీలో కలకలం రేపింది.

వరంగల్‌ డీసీసీ పరిధిలోని పార్టీ వ్యవహారాల్లో జనగామ డీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుంటున్నారంటూ వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వి.హన్మంతరావు తన నివాసంలో నాయిని రాజేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ అంశంపైన పార్టీ కోర్‌ కమిటీలో మాట్లాడదామని, తొందర పడవద్దని నాయినికి వారు సూచించినట్లు తెలిసింది. పొదెం వీరయ్యకు ఫోన్‌ చేసిన వీహెచ్‌ ఓపిక వహించాలని, కోర్‌ కమిటీలో మాట్లాడదామని సూచించినట్లు సమాచారం. ఈ నెల 24 లోపు కోర్‌కమిటీ సమావేశం జరిగేలా ప్రయత్నిస్తాననీ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లో బోసురాజు, పొన్నాల లక్ష్మయ్యతోనూ వారు మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వీహెచ్‌, ఈ అంశాలపైన చర్చించేందుకు కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు…