వరంగల్‌ 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ కావేటి కవిత భర్త కావేటి రాజు యాదవ్‌ మరణాన్ని తట్టుకోలేక అతడి అన్న కావేటి వెంకటేశ్వర్లు (48) మృతిచెందిన విషాద సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దేశాయిపేట రోడ్డులో నివాసం ఉంటున్న కార్పొరేటర్‌ కవిత ఇంట్లో వెనువెంటనే విషాదం జరగడంతో స్థానికులు విచారంలో మునిగారు. రెండు రోజుల క్రితం కవిత భర్త కావేటి రాజు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే రాజు మృతిచెందడంతో అన్న వెంకటేశ్వర్లు తట్టుకోలేకపోయాడు. కరీంనగర్‌లో డీటీడీసీ కొరియర్‌ సర్వీస్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు తమ్ముడు రాజు చనిపోయిన సమాచారం తెలుసుకుని ఇంటికి వచ్చాడు.

వరంగల్‌ డీటీడీసీ కొరియర్‌ సర్సీస్‌ పనులు చూసుకుంటున్న రాజు మరణంతో వెంకటేశ్వర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తమ్ముడి కోసం రోజంతా విషాదంలో మునిగి, చివరకు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం అలుముకుంది. తమ్ముడు రాజు చనిపోయిన మరుసటి రోజే అన్న వెంకటేశ్వర్లు కాలం చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటేశ్వర్లు అంత్యక్రియలను గురువారం దేశాయిపేటలో నిర్వహించారు. కాగా, ఒకరి వెంట మరొకరు అన్నదమ్ములిద్దరూ అకస్మాత్తుగా మృతిచెందడంతో కార్పొరేటర్‌ కవిత తీవ్ర మనోవేదనకు గురై హన్మకొండలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతోంది.