గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం తొలిఘట్టం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్షన్ల కోసం ప్రభు త్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగం గా గ్రేటర్‌ పరిధిలోని కొత్త డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ప్రక్రియను 12 రోజల్లో పూర్తి చేయాలని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం నుంచి ఓటర్ల గుర్తింపు కోసం కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్‌ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లను అధికారులు పునర్విభజించి 66కు పెంచారు. దీనిని ఆమోదించిన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 66 డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.

12 రోజుల ప్రణాలిక చేయాల్సినవి:

  • ఏప్రిల్‌ 3-7వరకు(5రోజులు): 66 కొత్త డివిజన్లలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఇంటింటా సర్వే చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాలి.
  • ఏప్రిల్‌ 8 (ఒక్క రోజు): డివిజన్ల వారీగా ఇంటింటా సర్వే చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదాను ఆర్డీవో, ఎంఆర్‌వో కార్యాలయాల్లో ప్రదర్శించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గుర్తించిన రాజకీయ పార్టీలకు అందజేయాలి.
  • ఏప్రిల్‌ 9 నుంచి 11 వరకు (3 రోజులు): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని కార్యాలయ నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాలి.
  • ఏప్రిల్‌ 12 నుంచి 13 వరకు (2 రోజులు) : అభ్యంతరాల పరిశీలన కోసం డివిజన్లవారీగా అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి.
  • ఏప్రిల్‌ 14న: గ్రేటర్‌ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను ప్రకటించాలి.