కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా అత్మకూర్ మండలం మల్కంపేటలో చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎస్సై రాజ్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బుస్స రాజు, పద్మ దంపతుల కూతురు అంజలి(17) పరకాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.

నవంబర్ 20న కాలేజీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అంజలి సాయంత్రానికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె తల్లి దండ్రులు.. చుట్టుపక్కల గ్రామాలు, బంధువులు, స్నేహితుల ఇంట్లో అంజలి ఆచూకి కోసం ఆరా తీశారు. అయినా జాడ లభించక పోవడంతో అంజలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కళాశాలకని చెప్పి వెళ్లిన అంజలీ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తమ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలవరానికి గురి చేసింది.