కరోనాతో కాదు, కేవలం పాజిటివ్‌ వచ్చిందన్న భయమే ఆ కుటుంబాన్ని కబళించింది. తండ్రీకొడుకులను బలితీసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధుడి(70)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి పాజిటివ్‌ అని తేలడంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన తండ్రి పదకొండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఓ వైపు కరోనా, మరో వైపు తండ్రి మరణంతో కుమిలిపోతున్న కొడుకు బుధవారం తెల్లవారుజామున ఏడుస్తూనే కుప్పకూలిపోయాడు.

ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మరణించాడని ధ్రువీకరించారు. అయితే అంతకు ముందు కనీసం తండ్రి దహన సంస్కారాలను తన చేతులతో చేయలేదనే బాధతో దశదిన కార్యక్రమమైనా తానే చేయాలనుకున్నాడు ఆ కుమారుడు. కానీ ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.