భర్తలో వచ్చిన విభేదాలతో మనస్తాపం చెందిన వైద్యురాలు తన కన్న బిడ్డతో సహ బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజమహేంద్రవరంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని దేవీచౌక్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ లావణ్య(33)కు తొమ్మిదేళ్ల కిందట వెంకటేశ్వరరావుతో వివాహం అయ్యింది. వారికి నిషాంత్‌(7) అనే కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని నిషాంత్‌తో కలిసి లావణ్య తండ్రి వద్దనే ఉంటోంది. రెండేళ్ల కిందట వరంగల్‌కు ప్రాంతానికి చెందిన డాక్టర్‌ వంశీకష్ణతో ద్వితీయ వివాహం చేశారు.

ఆయనతో కూడా మనస్పర్థలు రావడంతో నెల రోజుల కిందట రాజమహేంద్రవరంలోని తండ్రి బుద్దుడు వద్దకు వచ్చి ఉంటోంది. ఆ క్రమంలో ఇటీవల వంశీకృష్ణ నుంచి విడాకుల నోటీసు రావడంతో లావణ్య తీవ్ర మనస్తాపం చెందారు. శుక్రవారం రాత్రి తన బిడ్డ నిషాంత్‌కు అధిక మోతాదులో నిద్రమాత్రలు ఇచ్చి ఆమె కూడా తీసుకుంది. శనివారం తెల్లవారుజామున విషయం గమనించిన కుటుంబికులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మూడో పట్టణ పోలీసులు కేసు దర్యాస్తు చేస్తున్నారు.