వరంగల్: ఆలు లేదు చూలు లేదు కానీ అప్పుడే అధికారపార్టీ నేతలు పదవులు పంచేసుకుంటున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం అని ఓరుగల్లు లో ఓ నేత ప్రచారం చేసుకుంటుంటే హైదరాబాద్ లో ఓ నేత ముహుర్తాలు చూసుకుంటున్నారట మరో నేత ఇందూరులో పంచె ఎగరేసి మరి తనకు మంత్రి పదవి ఖాయం అని మిగిలినవారితో తనకు పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట మొత్తానికి కేటీఆర్ సీఎం పదవేమో కానీ ఎమ్మెల్యేల జోరు చూసి మాత్రం టీఆర్ఎస్ సీనియర్లు ముక్కున వేలేసుకుంటున్నారట

ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఉంది కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు:

ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చలకు కేంద్ర బిందువయ్యారు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌. ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారం మాములుగా లేదు. తమ నేత రెడ్యా నాయక్‌ డిప్యూటీ సీఎం అవుతారని ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారట. ఇటీవల డోర్నకల్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రెడ్యానాయక్‌, కాబోయే సీఎం కేటీఆర్‌ అని కామెంట్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా అనుచరులు ఆ ప్రచారానికి మరో రెండు తగిలించి కేటీఆర్‌ కేబినెట్‌లో తమ నేత రెడ్యానాయక్‌కు డిప్యూటీ సీంఎ పదవి వచ్చేస్తుందని తెగ సంబరపడుతున్నారు. డోర్నకల్‌ అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు బీజేపీ వల విసురుతోంది. ఈ వలకు పార్టీ నేతలతోపాటు రెడ్యా నాయక్‌ కూడా చిక్కారని ప్రచారం జరగడంతో. ఆయన్ని పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడినట్టు చెబుతున్నారు. మంచి అవకాశం ఇస్తాం, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని హామీ ఇచ్చారట.

ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి రకరకాల కథనాలు అల్లేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. జిల్లా నుంచి ఎస్టీ కోటాలో మంత్రిగా సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. మరి, రెడ్యానాయక్‌కు ఎలా అవకాశం ఇస్తారన్నది పార్టీ నేతల ప్రశ్న. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అదే స్పీడులో ఉన్నారట. కేటీఆర్ కేబినెట్ లో తమ నేతలకు మంత్రి పదవి ఖాయమైందని వారి కేడర్ ప్రచారంతో హోరెత్తిస్తుందట. వరంగల్ లో మరో సీనియర్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సైరం మంత్రి పదవి పై భారీ ఆశలే పెట్టేసుకున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ కి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బల్కా సుమన్ అనుచరులు సైతం తమ నేతకు మంత్రి పదవి ఇప్పటికే ఖరారైపోయిందని జిల్లాలో ప్రచారం చేస్తున్నారట. చూడాలి మరి కేటీఆర్ సీఎం అయ్యేది ఎప్పుడో వీరు మత్రులుగా ప్రమాణం చేసేది ఎప్పుడో..